Wednesday, January 10, 2007

సంపూర్ణ ఆరవ సర్గ

సీతను కానక వగచిన మారుతి
స్థిమితము చెందిన మనమును పొంది
మాతను కనుగొన నిస్చయించుకొని
ఆరంభించెను సోధన మళ్ళి 1

సూర్యుని సరిబ్రోలు కాంతులతో
కాంచన వెలుగుల మెరుపులతో
దేదీప్య మానముగ శోభిల్లుతున్న
రావణ మందిరము కడకు చేరెను 2

దుర్బేధ్య ప్రహరీ గోడలతోను
బలులగు రాక్షస వీరులతోను
రక్షితమగు రావణ మందిరమును
సమీక్షించెను హనుమ నిశితముగ 3

విచిత్రములగు ద్వారములతోను
సుందరమగు తలుపులతోను
వెండియు బంగారు దారులతోను
వెలుగుచుండెనది దేదీప్య మానముగ 4

గజములనెక్కిన వీరులతోను
ఆయుధులైన సైన్యముతోను
సిక్షణ పొందిన గుర్రములతోను
అలంకృతమైన రధములతోను 5

ఏనుగు దంతముల నగిషీతోను
సింహము పులుల తోళ్ళతోచేసిన
వివిధ రకముల ఢాళ్ళతోను
ఉరుముల సరిపోలు రధ ద్వనితోను 6

వజ్రములు పొదిగిన ఆసనములతోను
అమిత విలువగల వస్తువులతోను
రాక్షస వీరుల గుంపులతోను
అలరారు చుండెను రావణ భవనము 7

వివిధ పక్షుల కిలకిలల తోను
పెంపుడు మృగముల అరుపుల తోను
మధురమగు వీణా నాదముతోను
ప్రశాంతత నిండెనా భవనమునందున 8

సుశిక్షిత రాక్షస అంగరక్షకులతో
సుందర భామినీ సమూహములతో
నృత్య సంగీత విశేష గోష్టులతో
నిండి వుండెను మందిరమంతయు 9

మగువల అడుగుల సవ్వడులతో
భామినీ కంకణ గణగణలతో
యువతుల కిలకిల నవ్వులతో
సాగర హోరులా గురుతు తెచ్చుచు 10

గంధపు చెక్కల వాసన కల్గి
రాజ ఠీవి గల హంగులు కల్గి
వీర రాక్షసుల పహారా కల్గి
సింహములు నిండిన అడవిని పోలి
ఒప్పు చుండెను రావణ భవనము 11

మృదంగ, భేరీ నాదాలు నిండి
శంఖ ఘుంఘుమ ధ్వాన్ములతోడి
వేద మంత్రముల ఘొషల నడుమ
పండుగ పబ్బాల సందడి నిండగ 12

వజ్రములు పొదిగిన కప్పులతో
సముద్రమంతటి ఆంగళ్ళతో
అలరారుతుండెడి రావణమందిరమును
హనుమ అచ్చెరువంది చూచుచుండెను 13


రధములు గజములు వీరులు ధీరులు
వజ్రపు గుట్టలు కాంచన వీధులు
లంకా నగరపు తలమానికమువలే
వెలుగు చుండెను రావణ భవనము 1415

పట్టుబడెదనని భయము ఒకదరి
సీతను కనుగొన పట్టు హనుమది
భవనములన్నియు వెదుకుచు తిరిగెను
రాక్షసుల పహారా తప్పుకు తిరిగెను 16

అమిత వేగము అద్భుత శక్తియు
కలిగిన హనుమ వెదక సాగెను
ప్రహస్తుని గృహము వెదకిన పిమ్మట
మహాపార్శ్వుని ఇల్లు వెదికెను 17

ఆపై హనుమ వెదక సాగెను
కాల మేఘము వలె నల్ల గ వున్న
కుంభ కర్ణుని రాజ ప్రాసాదము
ఆపై విభీషణ మందిరము వెదికెను 18

అంతట దుమికెను మహోదర గ్రుహమున
ప్రక్కనె వున్న విరూపాక్షుని నెలవున
ఆప్రక్కనదైన విద్దుత్జిహ్వుని గృహమున
మారుతి వెదికెను ఒక్కటి విడువక 19

బుద్ధికుశలుడు శుకుని నెలవును
ఆపై వీరుడు సారణ గ్రుహమును
ప్రక్కనె వున్న ఇంద్రజిత్‌ భవనమును
వానర వీరుడు కలియ దిరిగెను 20

గడప గడప ఎక్కి దిగుతు
జంబుమాలి, సుమాలి ఇళ్ళను
రస్మికేతుడు సుర్యకేతుని గృహములు
అదియెవరుసలో వజ్రకాయుని నెలవును 2122

ధూమ్రుడు, సంపాతి గృహములు
విధుద్రూపుడు భీముని ఇళ్ళను
ఘన విఘన సుఖనుల వాసములు
వక్రుని సథును మరి వికటుని నెలవును 23

బ్రహ్మకర్ణుడు దంష్రుని ఇళ్ళు
రోముని మరి రక్షుని ఇళ్ళను
యుద్ధోన్మత్తుని, ఇంద్రజిహ్వుని గృహములు
హస్తిముఖుని మరి కరాళుని విడిదియు 24

పిశాచుని, షొణితుని ఇళ్ళను 25
ఒక్కటి వదలక హనుమ తిరిగెను
రాక్షస సంపదను, అద్భుత లంకను
తేరిచూచెను హనుమ ఆస్చర్యమున 27

గది గది తిరిగుతు ప్రతి గడపెక్కుతు
వీధులు వెదుకుతు సందులు చూచుచు
సీతను గానక తనలో వగచుచు
రావణ గృహమును హనుమ చేరెను 28

వానర వీరుడు మెల్లగ కదలుచు
ఎర్రటి కన్నులు తోను సూలము ముద్గర
శక్తి తోమరము మొదలగు అస్త్రముల తోను
పహరా కాయు రాక్షసిలను చూసెను 29

వివిధ రకముల సైనిక దళములు
మేలురకముల శస్త్ర అస్త్రములు
భీకర కాయులు సర్వ సన్నద్ధులు
కల రవణమందిరము హనుమ చూసెను 30

తెలుపు, యెరుపు, గోధుమ వన్నెకలవియు
వాయుగతిని మించిన వేగము గలవియు
మేలు జాతి గుర్రపు మందలను,
శత్రు మూకలను చీఎల్చ గలిగినవియు 31

మంచి శిక్షణ పొంది వున్నవియు
మదపు ధారలు కార్చుతున్నవియు
కారు మబ్బువలె విశాలమైనవియు
ఉరుములను బ్రోలు ఘీంకారించునవియు 32

యుద్ధరంగమున అలివి కానివియు
మంచి బలముగల గున్న ఏనుగులను
మేలు జాతి మదపుటేనుగు మందలను
హనుమ అచ్చెరువంది చూచుచుండెను 33

వేలకొలది శైన్య విభాగములు గల్గి
గుట్టలు పోసిన మణి మాణిక్యములు గల్గి
సూర్యుని కాంతితో వెలుగులు చిమ్ము
రావణ మందిరమును హనుమ చూసెను 3435

వివిధ ఆకృతుల సోపానములు గల్గి
శోభల తేలు కళా మందిరములు గల్గి
గంధపు నిర్మిత విలాస గృహములు గల్గి
రసికులు నిండిన కామ కేళీ గృహములు గలిగి 3637

మందర గిరిని పోలు భవనములు గల్గి
పురివిప్పిన నెమలి పించము బోలిన
రంగు రంగుల పతాక తోరణములు గల్గి
వైఢూర్య మరకత మాణిక్య రాసులు గల్గి
బంగార నిర్మిత పాత్రలు గలిగి
కాంచన తొడుగుల మెరయు సోపానములు గల్గి
వింత కాంతులతో వెలసిల్లు తున్న
రావణ మందిరము సూర్యుని వలే
భాసిల్లుతున్న రావణ మందిరము హనుమ చేరెను 41

మధువుతొ తదిసిన చిత్తడి నేలతొ
మణులతొ నిండిన పెద్ద కుండలతొ
యువతుల నగల గణ గణ మోతలతొ
తాళ బద్ధమగు మృదంగ ధ్వనులతొ 42
వేలకొలది సుందర పరిచారికా గణములతొ
బహు విసాలమగు అద్భుత చావళ్ళతొ
కుబేరుని నెలవువలె సుందర కాంతులతొ
వెలుగొందుతున్న రావణ మందిరమును
మారుతి వెదికెను, సీత కోసమై 43

No comments: